వ్యవసాయ రంగంలో సమూల మార్పుల ద్వారా సాగును లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సహా 10 వేల మందితో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమం కోసం, సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి ప్రకటించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారు.

ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘మీకోసం రైతన్నా’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనున్నారు.

ఈ సందర్భంగా టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “గత 7 నెలలుగా రైతులను, వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద దాదాపు 46.50 లక్షల మందికి పైగా రైతులకు రెండు విడతలుగా రూ.14 వేలు జమ చేశాం. రెండు విడతల్లో కలిపి రూ.6,310 కోట్లు రైతులకు చెల్లించాం. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపట్టాం. ఇలాంటి వాటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను ప్రకటించాం. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టాం. ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతులకూ అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలి. దీంతో పాటు వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించాలి. ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి” అని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *